ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

  • ఏపీలో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ ప్రారంభం
  • స్వీయ నమోదు ప్రక్రియను ఆరంభించిన సీఎం చంద్రబాబు
  • ఆన్‌లైన్‌లో తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న ముఖ్యమంత్రి
  • మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ
  • ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం
రాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్-హౌస్ సెన్సెస్ ప్రక్రియలో భాగంగా, తొలి వ్యక్తిగా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

అమరావతిలోని తన నివాసంలో se.census.gov.in వెబ్ సైట్ ద్వారా చంద్రబాబు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ ఇళ్ల వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, మే 1 నుంచి 30 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వచ్చి భౌతికంగా వివరాలు సేకరిస్తారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పౌరులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు సమానంగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికోసం కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం అవసరమని, ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జనగణన జరగడం ఇదే తొలిసారి అని, ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు.

జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో భాగంగా ప్రస్తుతం ఇళ్ల గణన ప్రారంభమైందని, వచ్చే ఏడాది రెండో దశలో జనాభా లెక్కల సేకరణ చేపడతారని సీఎం వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ నమోదు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సరైన వివరాలు నమోదు చేసి ఈ బృహత్కార్యాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Chandrababu Naidu
Andhra Pradesh
House listing
Population Census
Self Enumeration
AP Census 2024
Online Portal
J Nivas
Census India
AP Government

More Telugu News